A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Friday, March 15, 2013

ఆదిశంకరుల గురుభక్తి

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

11. ఆదిశంకరుల గురుభక్తి

'ఆచార్య' అనే పదం చెవిలో పడితే చాలు, మనకి జ్ఞాపకానికి వచ్చేది శంకరాచార్యులే. ఆయన తన గురువు గోవింద భగవత్పాదాచార్యులను, వారి గురువైన గౌడపాదాచార్యులను దక్షిణామూర్తి స్వరూపంలో చూసి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నమస్కారక్రియగా వ్రాశారు. శంకరులవారే స్వయంగా దక్షిణామూర్తి అవతారము. కానీ వారు వ్రాసిన దక్షిణామూర్తి స్తోత్రంలో, ప్రతీ శ్లోకంలోనూ, "తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే" అన్న వాక్యం నాలుగవ పాదంలో జోడించి నమస్కరిస్తున్నారు.

తమ గురుభక్తిని ఒక శ్లోకంలో శంకరులు ఈ విధంగా వ్యక్తం చేశారు.

"ఈ మూడు లోకాలలోనూ జ్ఞానదాతయైన సద్గురువుతో పోల్చదగిన వస్తువు లేదు. వరుసవేది అయః పిండాన్ని బంగారంగా మార్చగలదు. కానీ రాతిని మరొక వరుసవేదిగా అది రూపొందించలేదు.

గురువు అనగా తనను ఆశ్రయించిన వారిని తనంతటి వానిగా చేయగలడు. అందుచేత గురువుకు సాటి ఎవరూ లేరు."

కాశీలో పరమేశ్వరుడే ఛండాల రూపంలో శంకరుల ముందు నిలిచినపుడు, "ఛండాలోస్తు సతుద్విజోస్తు గురురాత్యేషామనీషామఘ" ఆత్మజ్ఞాని ఛండాలుడైనా సరే, నాకు గురువే - ఉద్ఘాటించారు. తానే జగదాచార్యులు అయినప్పటికీ, అందరి సమక్షంలో ఈ విధంగా వినయంగా చెప్పుకున్నారు.

12. రామానుజాచార్యుల వారి గురుభక్తి
రామానుజులు తన గురువు యొక్క ఆదేశమునకు విరుద్ధంగా తనకు ఉపదేశించిన మంత్రాన్ని అందరికీ ఉపదేశించారు. (ఆయన గురువు తిరుకోటియూర్ నంబి). కానీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆ గురువు గారికి రామానుజులు వినమ్రుడై ఉండినారు. ఆయన గురువు ఉపదేశం ఇవ్వడానికి పూర్వము, రామానుజులను 18 మార్లు శ్రీరంగం నుండి తిరుకొట్టియూరుకు వచ్చిపొమ్మన్నారు. కానీ రామానుజులు ఏ విధమైన అనిఛ్చకానీ, అఔకర్యం కానీ గురువుకు వ్యక్తం చేయలేదు.

గురువుకు స్మార్తులు నాలుగు సార్లు సాష్ఠాంగ నమస్కారము చేస్తారు. వైష్ణవులు 'గురువు చాలు' అని చెప్పేంతవరకు నమస్కారాలు చేస్తూనే ఉంటారు. ఒకమారు తిరుకోటి నంబి నదిలో స్నానం చేస్తున్నారు. నదీతీరంలోని ఇసుక సూర్యరశ్మికి వేడిగా ఉంది. ఉష్ణం అసహనంగా ఉన్నా రామానుజులు లెక్కచేయక మండే ఇసుకలో తిరుకోటినంబికి నమస్కారాలు చేస్తూనే వున్నారట. శిష్యుని కష్టం చూసి గురువు ఇక చాలు అని నమస్కారాలు నిలిపారట.

13. శంకరుని శిష్యులు
భగవత్పాదుల శిష్యులు స్వయంగా మహాత్ములు. కానీ వారి గురుభక్తి అసమానము.  శంకరుల శిష్యులలో తోటకాచార్యులు - భవ ఏవభవాన్ - నీవు స్వయంగా భవుడవే (శివుడవే), నీవు వృషధ్వజుడివి అని తోటకాష్టకంలో స్తుతి చేశారు.

ఒకప్పుడు వ్యాసుల వారు శంకరులను పరీక్షింపదలిచి వృద్ధ వేషంలో బ్రహ్మసూత్రభాష్యంపై వాదానికి వచ్చారు. అపుడు వారి సమక్షంలో పద్మపాదాచార్యుల వారున్నారు. వారి వాదం అతి తీవ్ర స్థితిలో ఉన్నప్పుడు - 'శంకరః శంకర స్సాక్షాత్ వ్యాసో నారాయణ స్వయం' - అని పద్మపాదులు తమ గురువును హెచ్చరించారు.

పిదప పద్మపాదులు శంకరభాష్యంపై ఒక విసృతిని రచించారు. దానిని పంచపాదిక అని అంటారు. అందులో శంకరులు వారు 'అపూర్వ శంకరులు' అని పిలిచి తమ గురుభక్తిని వెల్లడి చేశారు.

పద్మపాదుల అసలు పేరు సనందుడు. ఆయనది చోళదేశం. వారు కాశీలో ఆదిశంకరులకు 16 ఏళ్ళు నిండక ముందే శిష్యులయ్యారు. భాష్యములన్నీ అప్పటికే శంకరులు పూర్తి చేసి జీవితాన్ని చాలించాలని అనుకున్నారు. ఆ సమయంలోనే వ్యాసుల వారు శంకరులతో భాష్యసంవాదం చేసి, మెచ్చుకొని వారికి మరొక 16 ఏళ్ళు ఆయుర్దానం చేసి, 'భాష్యాలు వ్రాసినంత మాత్రాన ప్రయోజనం లేదు, పండితులతో చర్చ చేసి అద్వైత సిద్ధాంతాన్ని స్థిరీకరణ చేయడానికి, దేశమంతటా సిద్ధాంతం వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేయాలని అన్నారు. ఆ కథ అట్లా ఉండనీయండి.

శంకరులు కాశీలో ఉన్నప్పుడు గంగలో స్నానం చేస్తున్నారు. గంగకు ఆవలి తీరంలో పద్మపాదులు ధౌతవస్ర్తాలను ఎండపెడుతున్నారు. పద్మపాదుల గురుభక్తిని లోకానికి చాటుట కొఱకు శంకరులు ఎండిన మడి బట్టలను తెమ్మన్నారు. మధ్యలో నది ఉన్నదన్న సంగతి కూడా సనందుడు మరిచిపోయాడు.

నీళ్లలో నడుస్తూ ఉంటే గంగాదేవి ఆయన మునగకుండా పాదముల క్రింద తామర పుష్పములను ప్రభవింపజేసింది. తాను నడుస్తుంటే తన పాదముల క్రింద పద్మములు విచిత్రంగా వస్తున్నవన్నదీ, శంకరులు నీవు గంగను ఎట్లా దాటావు అని అడిగేంతవరకూ ఆయనకి దేహస్ఫురణ లేదు.

మీ స్మరణ మాత్రాన ఈ సంసారార్ణవం జానుధగ్ధమౌవుతుంది. (మోకాలి లోతు) గంగను తరించడం ఒక లెక్కయా?? అని సనందనుడు బదులు చెప్పారట. అప్పటి నుంచీ వారికి పద్మపాదులన్న పేరు స్థిరమయింది. ఈశ్వరావతారమైన భగవత్పాదుల వారి శిష్యుడు పద్మపాదులవటం సమంజసంగానే ఉంది.

(సశేషం .....)


సర్వం శ్రీగురుచరణారవిందార్పణమస్తు.
-- SRI MOHAN KISHOR NEMMALURI

No comments:

Post a Comment