A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Friday, March 15, 2013

గురువు - ప్రపంచము

 "సనాతన ధర్మము - గురు సాంప్రదాయము" - పరమాచార్యవారి అనుగ్రహభాషణములు

గురువు - ప్రపంచము
ఒక గురువు క్రమపద్ధతిలో బోధ చేయడానికి ఇష్టపడక పోవచ్చును. కానీ శిష్యులను ఆశీర్వదించాలని కోరుకోవచ్చును. ఇంకో మహాత్ముడు ఆశ్రితుల విషయంలో ఈ ఆశీర్వాద బాధ్యత కూడా మనకెందుకని ఊరుకోవచ్చును. అలాంటప్పుడు ఆ ఆశ్రితులను ఈశ్వరుడే రక్షిస్తాడు. వరప్రదానం చేస్తాడు. అనన్యంగా నమ్ముకున్న ఆ ఆశ్రితులకు దేవుని చేయూత ఎప్పుడూ ఉంటుంది.

అంధకారాన్ని పోగొట్టి జ్ఞానదీపాన్ని వెలిగించే ఏ సంభవమైనా ఉపదేశమే.

సాధారణంగా ఒక గురువే శిష్యుని మంత్రోపదేశం ద్వారా అనుగ్రహించి అతనికి శక్తిపాతం కలిగిస్తాడు. కొందరు మహాత్ములు శాస్త్రోపన్యాసములు ఇవ్వకపోయినా వారి శిష్యులకు మాత్రం మంత్రోపదేశం చేస్తారు. మనం ఎన్ని కథలు చదివి ఉన్నాం. ఒక మహాత్ముని ముందు ఒకడు ఎంతో కాలం పడిగాపులు కాస్తూ ఉంటాడు. ఒక్కరోజు హఠాత్తుగా ఆ మహాత్ముడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ క్షణం నుంచీ అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. గురుమూలకంగా మంత్రోపదేశం పొందాలని తపస్సు చేసిన శిష్యులూ, యుక్తి చాతుర్యం ప్రకటన చేసిన శిష్యులూ ఉన్నారు.

ఇక్కడ కబీరు కథ చెప్పాలి. రామానందులనే ఒక మహాత్ముని వద్ద కబీరు రామ మంత్రోపదేశం పొందాలని పరితపించేవాడు. కానీ అతడు ముస్లిము. అతడు హిందువే అనీ ముస్లిములచేత పెంచబడ్డాడనీ కొందరంటారు. రామానందులు తనకి మంత్రోపదేశం ఇవ్వరేమో అని అతనికి తోచింది. ఎట్లాగైనా ఆయన వద్ద మంత్రోపదేశం పొందాలని ఒక ఎత్తు వేశాడు. ఒకరోజు బ్రాహ్మీ ముహూర్తములో రామానందులు గంగా స్నానానికి వచ్చారు. కబీరు గంగా నది స్నాన ఘట్టంలో మెట్లమీద పడుకొని ఉన్నాడు. చీకటిగా ఉన్నందున రామానందుల వారు పడుకుని ఉన్న కబీరు మీద పాదములు మోపారు. కబీరు దానినే 'పాదదీక్ష'గా స్వీకరించాడు. (దీక్ష గురించి తర్వాత చెబుతాను..) ఎవరినో త్రొక్కినట్లు తోచగానే ఆయన రామరామ అని పాదాఘాతానికి ప్రాయశ్చిత్తముగా గట్టిగా ఉఛ్చరించారు. కబీరుకు అదే ఉపదేశమైనది. తారకమంత్రాన్ని ఏ విధంగానైనా రామానందుల వారి నుండి పొందాలని కబీరు ఈ పన్నాగం పన్నినాడు.

ఇంతకూ ఈ కథ ఎందుకు చెప్పానంటే రామానందుల వారు ఉద్దేశ పూర్వకముగా కబీరుకు మంత్రోపదేశము చేయలేదు. కానీ ఆయన రామరామ అనగానే, శిష్యుని సంకల్పం వలన, వారి అనుద్దేశపూర్వకమైన ఉఛ్చారణవలనా "గురుశిష్య సంబంధం" ఏర్పడినది అని చెప్పుటకు ఈ ఉదాహరణ.

మంత్రోపదేశం చేసిన వానిని గురువంటారు. ఈ మంత్రోపదేశం చేత గురుశిష్యుల మధ్య ఒక లంకె ఏర్పడుతుంది. ఆ మంత్రాన్ని వివరించవలసిన అవసరమూ లేదు. అది ఆచార్యుని పని. అకస్మాత్తుగా అనుద్దేశపూర్వకముగా ఒక మంత్రము ఉఛ్చరించినా గురువు అనుగ్రహం మంత్రం ద్వారా శిష్యుడిని సంక్రమిస్తుంది. లేదా ఆ మంత్ర శక్తి గురువు అనుగ్రహానికి మూలము అని కూడా చెప్పవచ్చును.

గురువు ఒక సిద్ధ గురువు అయితే, శిష్యుడు పరిపక్వమున్నవాడు అయితే, వాగ్రూపక మంత్రోపదేశమే అక్కర్లేదు. కానీ గురుశిష్యుల మధ్య ఒక సంబంధం మాత్రం ఏర్పడాలి. అది ఎట్లా సాధ్యం? గురువు శిష్యుని వంక ఒక మారు చూస్తే చాలు. అదే కటాక్ష దీక్ష అవుతుంది. వలసిన సంబంధం ఆ కటాక్షమే కలిగిస్తుంది. కటాక్షమాత్రాన శిష్యునికి జ్ఞానోపలబ్ధి ఏర్పడుతున్నది. గురువు శిశ్యుని శిరస్సుని స్పృశించడం కూడా దీక్షయే. దీనిని హస్త మస్తక దీక్ష అని అంటారు. కొన్ని సమయాలలో ఇవి ఏమీ అక్కర్లేదు, ఇవన్నీ స్థూల క్రియలు. గురువు సంకల్పం మాత్రాన "ఈ బిడ్డకు ఆరోగ్యం కలగాలి" అని అనుకున్న మాత్రంలో, అది ఉపదేశతుల్యమై గురుశిష్య సంబంధాన్ని వెంటనే సృష్టిస్తుంది.

(సశేషం....)



సర్వం శ్రీగురు చరణారవిందార్పణమస్తు.

-- SRI MOHAN KISHOR NEMMALURI

No comments:

Post a Comment