A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Thursday, September 20, 2012

Sri Malladi Chandrasekhara Sastry

ఆయన పురాణ ప్రవచనం చెబుతుంటే ఎంతటివారైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే!
ధర్మసందేహాలు కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు సమాధానాలు చెబుతుంటే ఆ వారం టి.ఆర్.పి. రేటింగ్ కచ్చితంగా ఆ చానల్‌దే! వారపత్రికలో పాఠకుల సందేహాలకు సమాధానాలు చెప్పేది ఆయనే అయితే ఆ పత్రికకే అత్యధిక పాఠకాదరణ! భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికిగాని, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గాని, శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునుల కల్యాణానికి గానీ వ్యాఖ్యానం చెబుతుంటే అందరి చెవులూ అటు వొగ్గవలసిందే!
ఆయన గళం నుంచి వెలువడే ప్రతిమాటా సప్రామాణికం, సవ్యాఖ్యాన సహితం!
ఈపాటికే అర్థమై ఉంటుంది ఆయనే
మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారని!
ఇది ఆయన ఇన్నర్‌వ్యూ...



మాది గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, గోరంట్ల అగ్రహారం. అప్పట్లో హైదరాబాద్ సంస్థానాధీశుడైన కిషన్ ప్రసాద్ వద్ద పెద్ద ఉద్యోగి అయిన మల్లాది లక్ష్మీనారాయణ, సుందరీబాయి దంపతులకు పిల్లలు లేకపోవడంతో మా తాతగారు రామకృష్ణ చయనులవారిని దత్తత తీసుకున్నారు. దాంతో మాకు హైదరాబాద్ మల్లాదివారని పేరొచ్చింది. మా తాతగారు పదిభాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ముహూర్తాలు పెట్టడం నుంచి శ్రౌత, స్మార్త, తర్క, మీమాంస, వేదాంతం వరకూ ప్రతి ఒక్క శాస్త్రమూ ఆయనకు కొట్టిన పిండే! ఆయన పరమ నైష్ఠికుడు.


ఆచార వ్యవహారాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. ఆయన ముగ్గురు మగసంతానంలో మా నాన్నగారు మధ్యలోనివారు. మళ్లీ వీరందరి సంతానంలో నేనే పెద్దవాడిని. అందువల్ల తాతగారికి నేనంటే చాలా ఇష్టం. 1925 ఆగస్ట్ 22 అర్ధరాత్రి, అంటే తెల్లవారితే వినాయక చవితి అనగా పుట్టాను. నేను నాలుగు నెలల వాడిగా ఉన్నప్పుడే తాతగారు నన్ను తనవెంట తీసుకొచ్చు కున్నారు. నాయనమ్మ కృష్ణవేణి సోమిదమ్మ గారే నన్ను సాకారు. తాతగారే నాకు ఉపనయనం చేశారు. ఆయన వద్దనే తర్క ప్రకరణాలు, శ్రౌతస్మార్తాలు అభ్యసించాను.



మా తండ్రిగారు దక్షిణామూర్తి శాస్త్రి పుష్పగిరి ఆస్థాన పండితులు. ఆర్షసంప్రదాయాన్ని ఆయన వద్దనే అలవరచుకున్నాను. పెత్తండ్రి వీరరాఘవ శాస్త్రిగారు తర్కవేదాంత పండితులు. పినతండ్రి హరిశంకరశాస్త్రిగారు తెనాలిలో వేదవిద్యాపరీక్షాధికారిగా పని చేసేవారు. నేను వేదాధ్యయనం ఆయనవద్దే చేశాను. కంభంపాటి రామ్మూర్తి శాస్త్రిగారి వద్ద పూర్వమీమాంస, వ్యాకరణం నేర్చుకున్నాను. తెలుగు మాత్రం వీధిబడిలో చదువుకున్నాను.
తాతగారికి నేను పురాణ ప్రవచనం చెప్పాలని కోరిక. ఇంగ్లిషు చదువులు చదివితే, ఉద్యోగం చేస్తానంటానని నేను దేనికీ పరీక్షలు రాయ నివ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయితే నాకేమో పురాణాలు చెప్పడం ఇష్టం ఉండేది కాదు. అది గ్రహించిన తాతగారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ‘‘చూడు నాయనా, పురాణ ప్రవచనం చెప్పాలంటే సంస్కృత వాఙ్మయం తెలిసి ఉండాలి. నిశిత పరిశీలన కావాలి. అన్వయం చెప్పగలిగి ఉండాలి. వేదాంతం, తర్కం, ఛందస్సు తెలిసుండాలి. కాబట్టి దీన్ని అంత తేలికగా తీసేయకు’’ అని చెప్పేవారు.


నా పదిహేడవ యేట మా తాతగారు కాలం చేశారు. ఆయన దూరమైనా ఆయన సంకల్పం మాత్రం ఎప్పుడూ నన్ను విడిచిపోలేదు. అమరావతిలో మా ఎదురింట్లో ఉండే జాగర్లమూడి రామశాస్త్రిగారికి కంటిలో శుక్లాలు వచ్చి చూపు తగ్గిపోవడంతో నన్ను పిలిచి రోజూ సాయంత్రం నాలుగు నుంచి 6 గంటల వరకు నాచేత పద్యాలు చదివించుకుని వినేవారు. మా ఊరిలో గోళ్లమూడి ప్రసాదరావుగారనేవైద్యుడు రోజూ సాయంకాలం సైకిల్ మీద రోగులను చూడటానికి వెళ్తుండేవాడు. ఆయన అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు నా పద్యాలు వినేవాడు.



ఓరోజు ఆయన నా దగ్గరకొచ్చి, ‘‘మీరు పద్యాలు చదువుతున్న తీరు బాగుంది. నేను ఒంటరిగా ఉన్నాను. ఏమీ తోచడం లేదు. కాబట్టి మా ఇంటికొచ్చి పద్యాలు చదివి పెట్టండి’’ అని అడిగాడు. నేను మొహమాటం కొద్దీ కాదనలేక ఆయన ఇంటికెళ్లాను. ఆయన ఎప్పటి నుంచో అటకమీద దుమ్ముపట్టి ఉన్న భాస్కర రామాయణాన్ని తీసి నా చేతికిచ్చాడు. నేను అందులో నుంచి పద్యాలు చదువుతుంటే ‘‘మీరలా పద్యాలు చదివితే నాకెలా తెలుస్తుంది, వాటికి అర్థం తెలిస్తే కదా ఆనందించగలిగేది’’ అన్నాడు. దాంతో నాకు తోచిన రీతిలో అర్థాలు చెబుతూ పద్యాలను చదివి వినిపించాను.
నా పద్యశ్రవణం కాస్తా కొందరు గ్రామస్థుల చెవిన పడడంతో ఊరిలోనివాళ్లు కొందరు డాక్టరు గారి దగ్గరకొచ్చి ‘‘ఇదేదో సాయంత్రం పూట పెట్టుకుంటే మేము కూడా వచ్చి వింటాం కదా’’ అన్నారు.
దాంతో డాక్టరుగారు తమ ఇంటి వసారాను కడిగించి పురాణ ప్రవచనం జరిగే విధంగా పీఠం, ఫొటో, పుస్తకం పెట్టారు. నేనూ చొక్కావిప్పి, ఉత్తరీయం ధరించి విభూతి రేఖలు దిద్దుకుని అచ్చం పౌరాణిక ప్రవచకుడిలా తయారై ఆ సాయంత్రం భాస్కరరామాయణాన్ని గ్రామస్థుల ముందు చెప్పాను. ఈవిధంగా దాదాపు నెల రోజులకు పైగా జరిగింది. ఊరిలో నాకు మంచి పేరొచ్చింది. అప్పటికి నాకు అర్థమైంది నేను పుట్టింది పురాణ ప్రవచనం చెప్పడానికేనని!



కొన్నాళ్లు గడిచాక బెజవాడ వెళ్లి వేదాంత శాస్త్రం చదవాలనే కోరికతో అమరావతి నుంచి బయల్దేరి గుంటూరు వచ్చాను. తీరా బస్టాండుకొచ్చాక పరిచయస్థులు కొందరు కనిపించి ‘‘పుష్పగిరి పీఠాధిపతులు ఇప్పుడు నరసరావుపేటలో ఉన్నారు. త్వరలో ఆయన మకాం మార్చేస్తారట. ఈలోగా నువ్వొకసారి వెళ్లి ఆయన దర్శనం చేసుకోవచ్చు కదా’’ అన్నారు. దాంతో నేను వెంటనే నరసరావుపేటకు బయల్దేరాను.
స్వాములవారి దర్శనం చేసుకోగానే ఆయన నాతో ‘‘నువ్వు అమరావతిలో పురాణ ప్రవచనం చక్కగా చెప్పావని తెలిసింది. నాకు కూడా వినాలని ఉంది, ఇవ్వాళ ఇక్కడ పురాణం చెప్పు’’ అన్నారు. ఆ మాటలను ఆదేశంగా తీసుకుని ఆయన ముందు వాల్మీకి రామాయణం చెప్పాను. స్వామివారు చాలా సంతోషించి, ‘‘నిన్ను నెలకు 40 రూపాయల గ్రాసం మీద పుష్పగిరి ఆస్థానంలో పురాణ పండితునిగా నియమిస్తున్నాను’’ అన్నారు. దాంతో నేను వారితోపాటే ఊరూరూ తిరుగుతూ ఏడాదిన్నరపాటు పురాణ ప్రవచనం చెప్పాను.
ఆ తర్వాత మా పెత్తండ్రి మల్లాది వీరరాఘవశాస్త్రిగారు బెజవాడలో బ్రహ్మసత్రయాగం జరుపుతుంటే ఆయన కోరిక మేరకు అక్కడ సుమారు సంవత్సరంపాటు ప్రవచనం చేశాను. నా ఇరవై అయిదవ ఏట నా వివాహం ఈమనికి చెందిన సీతారామ ప్రసన్నతో జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 1951లో నాకు కొడుకు పుట్టాడు. తాతగారి జ్ఞాపకార్థం రామకృష్ణ అని పేరుపెట్టాను. ఆ తర్వాత మరో ఐదుగురు మగపిల్లలు, ఇద్దరాడపిల్లలు.



వీరందరికీ చదువులు, పెళ్లిళ్లు, పురుళ్లు, పుణ్యాలు... అన్నీ పురాణ ప్రవచనాల ద్వారా ఆర్జించిందే తప్ప మరో విధంగా వచ్చింది లేదు. నా ప్రవ చన కార్యక్రమంలో పడి ఒక్కోసారి రెండేసి నెలలు కూడా ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చేది. అటువంటప్పుడు నా భార్య ఎంతో ఓపికతో ఒంటి చేతిమీద ఇంటిని సమర్థించేది. ఆమె సహకారమే లేకపోతే నేను ఏమీ చేయగలిగేవాడినే కాదు! నా ప్రవచనాలను రాష్ర్టమంతా పంచగలిగి ఉండేవాడినీ కాను! ఈ వృత్తి ద్వారా నేను లక్షలార్జించి మేడలూ మిద్దెలూ కట్టిందీ లేదు అలాగని దారిద్య్రంతో బాధపడిందీ లేదు. భగవంతుడు ఏది అనుగ్రహిస్తే అదే భాగ్యంగా భావించాను!
బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతోబాటు చిత్తూరు వి.నాగయ్య, ఘంటసాల, ఎస్వీరంగారావు, కన్నాంబ వంటి వెండితెర వేల్పులు నా ప్రవచనాలను ఎంతో ఇష్టపడేవారు. ఓసారి చిత్తూరు నాగయ్యగారు నన్ను ఇంటికి పిలిచి భోజన వస్త్రాలతో సత్కరించి, చేతికి స్వర్ణకంకణం తొడిగారు.



అప్పట్లో చాలామంది నన్ను సినిమాలలో నటించమని అడిగేవారు. నాకు ఇష్టం లేక అందరినీ తిరస్కరించాను. నేను ప్రవచనం చెబుతుండగా శ్రోతలు వింటున్నట్లుగా ఉండే దృశ్యాన్ని చిత్రీకరించాలని కొందరు దర్శకులు ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకనో అది కూడా వీలు పడలేదు.
నాకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా గుంటూరులో ఒక తను నా పేరు చెప్పుకుని నేను వస్తానని ప్రచారం చేసుకుంటూ పురాణ ప్రవచనంతో పొట్టపోసుకుంటున్నట్లు తెలిసింది. నేనతనికి బుద్ధి చెప్పాలనుకున్నాను. ఓసారి అతను నన్ను కలిసినప్పుడు నా అంతట నేనే పురాణ ప్రవచనం చెబుతానని చెప్పాను. అతనెంతో సంతోషించి భారీ ఏర్పాట్లు చేశాడు.
నా ఉద్దేశం ఏమిటంటే నాకు తెలియకుండా నా పేరు చెప్పుకున్నందుకు పదిమంది ముందు అతని పరువు తీసేయాలని! తీరా నేనెళ్లి మైకుముందు కూర్చుంటే గొంతు పెగల్లేదు. కనీసం శుక్లాంబరధరం కూడా పలకలేక స్టేజీమీదినుంచి దిగిపోయాను. ఆ సంఘటనతో భగవంతుడెప్పుడూ భక్తుల పక్షపాతే కాని, అహంభావుల పక్షం వహించడని తెలుసుకున్నాను. ఈనాటివరకు మళ్లీ అటువంటి ఆలోచనలు చేయలేదు.



ఆ తర్వాతెప్పుడూ అటువంటి పరిస్థితీ నాకు ఎదురవలేదు. అదే కాదు, భగవంతుడి దయవల్ల అనారోగ్యం కాని, జలుబు చేయడం, గొంతు బొంగురుపోవడం వంటివి కానీ నన్నెప్పుడూ బాధించనే లేదు. అన్నేసి గంటలపాటు ప్రవచనాలు చెప్పినా, గొంతు తడారిపోవటం, కంఠశోష వంటివి ఎప్పుడూ ఎరగను. ఇప్పటివరకూ నేను 250 దాకా రామాయణ ప్రవచనాలు, 300 మహాభారత ప్రవచనాలు, 200 భాగవత ప్రవచనాలూ చెప్పాను.
ఇవిగాక ప్రతియేటా ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవాడిని. దూరదర్శన్‌లోనూ, సప్తగిరి చానల్‌లోనూ ప్రవచనాలు చెబుతుంటాను. నాకిప్పుడు ఎనభై ఐదేళ్లు దాటాయి. ఒంట్లో ఓపిక సన్నగిల్లుతోంది, ప్రయాణాలు చేయలేకుండా ఉన్నాను. దాంతో 2011 జనవరి నుంచి నేను పురాణ ప్రవచనాలు చెప్పడం మానివేశాను.



అయితే ఇటీవల శ్రీవేంకటేశ్వర భక్తిచానల్, సప్తగిరి చానల్ వారు నా వద్దకొచ్చి ‘‘మీరు మా చానల్‌లో ప్రవచనం చెప్పవలసిందే’’ అని పట్టుబట్టడంతో మా ఇలవేల్పు పట్ల నాకున్న భక్తి, గౌరవం మేరకు వారిని కాదనలేకపోయాను. అందుకే అప్పుడప్పుడూ ఆ చానల్స్ వారికి మాత్రమే చెబుతున్నాను.
భగవంతుడు నాకిచ్చిన దానికి నేనెప్పుడూ అసంతృప్తి పొందలేదు. వైదిక ధర్మ ప్రచారం చేయడాన్ని, భగవంతుని లీలలను గానం చేయడాన్ని బాధ్యతగా భావించాను తప్పితే బరువనుకోలేదు. ఎవరికోసమూ ప్రత్యేకంగా చెప్పలేదు. సభలో భాగ్యవంతులున్నారా, పండితులున్నారా, పామరులున్నారా అని ఎన్నడూ ఆలోచించలేదు.
ఎవరినీ పనిగట్టుకుని పొగడలేదు. ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించాను. కాకపోతే పదేళ్లకొకసారి సామాజిక పరిస్థితులలో మార్పు వస్తుంటుంది కదా, అందుకు అనుగుణంగా మారుతూ వచ్చానంతే! అదెలాగంటే అప్పట్లోలా ఇప్పుడు పద్యాలు చెబుదామన్నా వాటిని విని ఆనందించేవారు లేరు కదా, అందుకు తగ్గట్టుగానే నన్ను నేను మలచుకున్నాను. అప్పుడే కాదు, ఇప్పటికీ నేను ఏ ఘట్టం చెబుతుంటే ఆ ఘట్టంలో పూర్తిగా లీనమవుతాను.



అది శోకరసమైతే నాకు దుఃఖమొస్తుంది. సంతోషకర సన్నివేశమైతే ఆనందంతో పరవశించి పోతాను. కాబట్టే ఇన్నేళ్లు గడిచినా, నా ప్రవచనం వినడానికొచ్చే ప్రేక్షక జనంలో తగ్గుదల లేదు. అయితే నేను మాత్రమే గొప్పగా చెప్పగలను అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పటివాళ్లు కూడా బాగానే చెబుతున్నారు. ఆదరణ కూడా బాగానే ఉంటోంది. ఈ సంస్కృతి చిరకాలంపాటు వర్ధిల్లాలన్నదే నా ఆకాంక్ష!

సేకరణ:సాక్షి ఫన్ డేపురాణ’ పురుషుడు

3 comments:

  1. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ప్రవచనముల ఆడియో/వీడియో మరియు పుస్తకములు ఎక్కడ లభ్యమవుతాయో వివరాలు చెప్పగలరు.అలాగే ఇప్పటి వరకూ విడుదల అయిన వీరి ప్రవచనముల వివరాలు తెలుపగలరు.

    ReplyDelete
    Replies
    1. Namaste.. Sree Malladi Chandrasekhara Sastri Gaari Pravachanalu

      http://www.pravachanam.com/audio/by/artist/malladi_chandrasekhara_sastri

      Delete
  2. Sastry gari dattatreya vaibhavam unte link share cheyagalaru

    ReplyDelete