A Detailed Information about all Temples
http://www.templedetails.com/

Thursday, September 20, 2012

Sri Malladi Chandrasekhara Sastry

ఆయన పురాణ ప్రవచనం చెబుతుంటే ఎంతటివారైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే!
ధర్మసందేహాలు కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు సమాధానాలు చెబుతుంటే ఆ వారం టి.ఆర్.పి. రేటింగ్ కచ్చితంగా ఆ చానల్‌దే! వారపత్రికలో పాఠకుల సందేహాలకు సమాధానాలు చెప్పేది ఆయనే అయితే ఆ పత్రికకే అత్యధిక పాఠకాదరణ! భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికిగాని, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గాని, శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జునుల కల్యాణానికి గానీ వ్యాఖ్యానం చెబుతుంటే అందరి చెవులూ అటు వొగ్గవలసిందే!
ఆయన గళం నుంచి వెలువడే ప్రతిమాటా సప్రామాణికం, సవ్యాఖ్యాన సహితం!
ఈపాటికే అర్థమై ఉంటుంది ఆయనే
మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారని!
ఇది ఆయన ఇన్నర్‌వ్యూ...



మాది గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, గోరంట్ల అగ్రహారం. అప్పట్లో హైదరాబాద్ సంస్థానాధీశుడైన కిషన్ ప్రసాద్ వద్ద పెద్ద ఉద్యోగి అయిన మల్లాది లక్ష్మీనారాయణ, సుందరీబాయి దంపతులకు పిల్లలు లేకపోవడంతో మా తాతగారు రామకృష్ణ చయనులవారిని దత్తత తీసుకున్నారు. దాంతో మాకు హైదరాబాద్ మల్లాదివారని పేరొచ్చింది. మా తాతగారు పదిభాషలలో అనర్గళంగా మాట్లాడేవారు. ముహూర్తాలు పెట్టడం నుంచి శ్రౌత, స్మార్త, తర్క, మీమాంస, వేదాంతం వరకూ ప్రతి ఒక్క శాస్త్రమూ ఆయనకు కొట్టిన పిండే! ఆయన పరమ నైష్ఠికుడు.


ఆచార వ్యవహారాల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండేవారు. ఆయన ముగ్గురు మగసంతానంలో మా నాన్నగారు మధ్యలోనివారు. మళ్లీ వీరందరి సంతానంలో నేనే పెద్దవాడిని. అందువల్ల తాతగారికి నేనంటే చాలా ఇష్టం. 1925 ఆగస్ట్ 22 అర్ధరాత్రి, అంటే తెల్లవారితే వినాయక చవితి అనగా పుట్టాను. నేను నాలుగు నెలల వాడిగా ఉన్నప్పుడే తాతగారు నన్ను తనవెంట తీసుకొచ్చు కున్నారు. నాయనమ్మ కృష్ణవేణి సోమిదమ్మ గారే నన్ను సాకారు. తాతగారే నాకు ఉపనయనం చేశారు. ఆయన వద్దనే తర్క ప్రకరణాలు, శ్రౌతస్మార్తాలు అభ్యసించాను.



మా తండ్రిగారు దక్షిణామూర్తి శాస్త్రి పుష్పగిరి ఆస్థాన పండితులు. ఆర్షసంప్రదాయాన్ని ఆయన వద్దనే అలవరచుకున్నాను. పెత్తండ్రి వీరరాఘవ శాస్త్రిగారు తర్కవేదాంత పండితులు. పినతండ్రి హరిశంకరశాస్త్రిగారు తెనాలిలో వేదవిద్యాపరీక్షాధికారిగా పని చేసేవారు. నేను వేదాధ్యయనం ఆయనవద్దే చేశాను. కంభంపాటి రామ్మూర్తి శాస్త్రిగారి వద్ద పూర్వమీమాంస, వ్యాకరణం నేర్చుకున్నాను. తెలుగు మాత్రం వీధిబడిలో చదువుకున్నాను.
తాతగారికి నేను పురాణ ప్రవచనం చెప్పాలని కోరిక. ఇంగ్లిషు చదువులు చదివితే, ఉద్యోగం చేస్తానంటానని నేను దేనికీ పరీక్షలు రాయ నివ్వకుండా జాగ్రత్తపడ్డారు. అయితే నాకేమో పురాణాలు చెప్పడం ఇష్టం ఉండేది కాదు. అది గ్రహించిన తాతగారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ‘‘చూడు నాయనా, పురాణ ప్రవచనం చెప్పాలంటే సంస్కృత వాఙ్మయం తెలిసి ఉండాలి. నిశిత పరిశీలన కావాలి. అన్వయం చెప్పగలిగి ఉండాలి. వేదాంతం, తర్కం, ఛందస్సు తెలిసుండాలి. కాబట్టి దీన్ని అంత తేలికగా తీసేయకు’’ అని చెప్పేవారు.


నా పదిహేడవ యేట మా తాతగారు కాలం చేశారు. ఆయన దూరమైనా ఆయన సంకల్పం మాత్రం ఎప్పుడూ నన్ను విడిచిపోలేదు. అమరావతిలో మా ఎదురింట్లో ఉండే జాగర్లమూడి రామశాస్త్రిగారికి కంటిలో శుక్లాలు వచ్చి చూపు తగ్గిపోవడంతో నన్ను పిలిచి రోజూ సాయంత్రం నాలుగు నుంచి 6 గంటల వరకు నాచేత పద్యాలు చదివించుకుని వినేవారు. మా ఊరిలో గోళ్లమూడి ప్రసాదరావుగారనేవైద్యుడు రోజూ సాయంకాలం సైకిల్ మీద రోగులను చూడటానికి వెళ్తుండేవాడు. ఆయన అలా వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు నా పద్యాలు వినేవాడు.



ఓరోజు ఆయన నా దగ్గరకొచ్చి, ‘‘మీరు పద్యాలు చదువుతున్న తీరు బాగుంది. నేను ఒంటరిగా ఉన్నాను. ఏమీ తోచడం లేదు. కాబట్టి మా ఇంటికొచ్చి పద్యాలు చదివి పెట్టండి’’ అని అడిగాడు. నేను మొహమాటం కొద్దీ కాదనలేక ఆయన ఇంటికెళ్లాను. ఆయన ఎప్పటి నుంచో అటకమీద దుమ్ముపట్టి ఉన్న భాస్కర రామాయణాన్ని తీసి నా చేతికిచ్చాడు. నేను అందులో నుంచి పద్యాలు చదువుతుంటే ‘‘మీరలా పద్యాలు చదివితే నాకెలా తెలుస్తుంది, వాటికి అర్థం తెలిస్తే కదా ఆనందించగలిగేది’’ అన్నాడు. దాంతో నాకు తోచిన రీతిలో అర్థాలు చెబుతూ పద్యాలను చదివి వినిపించాను.
నా పద్యశ్రవణం కాస్తా కొందరు గ్రామస్థుల చెవిన పడడంతో ఊరిలోనివాళ్లు కొందరు డాక్టరు గారి దగ్గరకొచ్చి ‘‘ఇదేదో సాయంత్రం పూట పెట్టుకుంటే మేము కూడా వచ్చి వింటాం కదా’’ అన్నారు.
దాంతో డాక్టరుగారు తమ ఇంటి వసారాను కడిగించి పురాణ ప్రవచనం జరిగే విధంగా పీఠం, ఫొటో, పుస్తకం పెట్టారు. నేనూ చొక్కావిప్పి, ఉత్తరీయం ధరించి విభూతి రేఖలు దిద్దుకుని అచ్చం పౌరాణిక ప్రవచకుడిలా తయారై ఆ సాయంత్రం భాస్కరరామాయణాన్ని గ్రామస్థుల ముందు చెప్పాను. ఈవిధంగా దాదాపు నెల రోజులకు పైగా జరిగింది. ఊరిలో నాకు మంచి పేరొచ్చింది. అప్పటికి నాకు అర్థమైంది నేను పుట్టింది పురాణ ప్రవచనం చెప్పడానికేనని!



కొన్నాళ్లు గడిచాక బెజవాడ వెళ్లి వేదాంత శాస్త్రం చదవాలనే కోరికతో అమరావతి నుంచి బయల్దేరి గుంటూరు వచ్చాను. తీరా బస్టాండుకొచ్చాక పరిచయస్థులు కొందరు కనిపించి ‘‘పుష్పగిరి పీఠాధిపతులు ఇప్పుడు నరసరావుపేటలో ఉన్నారు. త్వరలో ఆయన మకాం మార్చేస్తారట. ఈలోగా నువ్వొకసారి వెళ్లి ఆయన దర్శనం చేసుకోవచ్చు కదా’’ అన్నారు. దాంతో నేను వెంటనే నరసరావుపేటకు బయల్దేరాను.
స్వాములవారి దర్శనం చేసుకోగానే ఆయన నాతో ‘‘నువ్వు అమరావతిలో పురాణ ప్రవచనం చక్కగా చెప్పావని తెలిసింది. నాకు కూడా వినాలని ఉంది, ఇవ్వాళ ఇక్కడ పురాణం చెప్పు’’ అన్నారు. ఆ మాటలను ఆదేశంగా తీసుకుని ఆయన ముందు వాల్మీకి రామాయణం చెప్పాను. స్వామివారు చాలా సంతోషించి, ‘‘నిన్ను నెలకు 40 రూపాయల గ్రాసం మీద పుష్పగిరి ఆస్థానంలో పురాణ పండితునిగా నియమిస్తున్నాను’’ అన్నారు. దాంతో నేను వారితోపాటే ఊరూరూ తిరుగుతూ ఏడాదిన్నరపాటు పురాణ ప్రవచనం చెప్పాను.
ఆ తర్వాత మా పెత్తండ్రి మల్లాది వీరరాఘవశాస్త్రిగారు బెజవాడలో బ్రహ్మసత్రయాగం జరుపుతుంటే ఆయన కోరిక మేరకు అక్కడ సుమారు సంవత్సరంపాటు ప్రవచనం చేశాను. నా ఇరవై అయిదవ ఏట నా వివాహం ఈమనికి చెందిన సీతారామ ప్రసన్నతో జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత అంటే 1951లో నాకు కొడుకు పుట్టాడు. తాతగారి జ్ఞాపకార్థం రామకృష్ణ అని పేరుపెట్టాను. ఆ తర్వాత మరో ఐదుగురు మగపిల్లలు, ఇద్దరాడపిల్లలు.



వీరందరికీ చదువులు, పెళ్లిళ్లు, పురుళ్లు, పుణ్యాలు... అన్నీ పురాణ ప్రవచనాల ద్వారా ఆర్జించిందే తప్ప మరో విధంగా వచ్చింది లేదు. నా ప్రవ చన కార్యక్రమంలో పడి ఒక్కోసారి రెండేసి నెలలు కూడా ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చేది. అటువంటప్పుడు నా భార్య ఎంతో ఓపికతో ఒంటి చేతిమీద ఇంటిని సమర్థించేది. ఆమె సహకారమే లేకపోతే నేను ఏమీ చేయగలిగేవాడినే కాదు! నా ప్రవచనాలను రాష్ర్టమంతా పంచగలిగి ఉండేవాడినీ కాను! ఈ వృత్తి ద్వారా నేను లక్షలార్జించి మేడలూ మిద్దెలూ కట్టిందీ లేదు అలాగని దారిద్య్రంతో బాధపడిందీ లేదు. భగవంతుడు ఏది అనుగ్రహిస్తే అదే భాగ్యంగా భావించాను!
బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతోబాటు చిత్తూరు వి.నాగయ్య, ఘంటసాల, ఎస్వీరంగారావు, కన్నాంబ వంటి వెండితెర వేల్పులు నా ప్రవచనాలను ఎంతో ఇష్టపడేవారు. ఓసారి చిత్తూరు నాగయ్యగారు నన్ను ఇంటికి పిలిచి భోజన వస్త్రాలతో సత్కరించి, చేతికి స్వర్ణకంకణం తొడిగారు.



అప్పట్లో చాలామంది నన్ను సినిమాలలో నటించమని అడిగేవారు. నాకు ఇష్టం లేక అందరినీ తిరస్కరించాను. నేను ప్రవచనం చెబుతుండగా శ్రోతలు వింటున్నట్లుగా ఉండే దృశ్యాన్ని చిత్రీకరించాలని కొందరు దర్శకులు ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకనో అది కూడా వీలు పడలేదు.
నాకున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా గుంటూరులో ఒక తను నా పేరు చెప్పుకుని నేను వస్తానని ప్రచారం చేసుకుంటూ పురాణ ప్రవచనంతో పొట్టపోసుకుంటున్నట్లు తెలిసింది. నేనతనికి బుద్ధి చెప్పాలనుకున్నాను. ఓసారి అతను నన్ను కలిసినప్పుడు నా అంతట నేనే పురాణ ప్రవచనం చెబుతానని చెప్పాను. అతనెంతో సంతోషించి భారీ ఏర్పాట్లు చేశాడు.
నా ఉద్దేశం ఏమిటంటే నాకు తెలియకుండా నా పేరు చెప్పుకున్నందుకు పదిమంది ముందు అతని పరువు తీసేయాలని! తీరా నేనెళ్లి మైకుముందు కూర్చుంటే గొంతు పెగల్లేదు. కనీసం శుక్లాంబరధరం కూడా పలకలేక స్టేజీమీదినుంచి దిగిపోయాను. ఆ సంఘటనతో భగవంతుడెప్పుడూ భక్తుల పక్షపాతే కాని, అహంభావుల పక్షం వహించడని తెలుసుకున్నాను. ఈనాటివరకు మళ్లీ అటువంటి ఆలోచనలు చేయలేదు.



ఆ తర్వాతెప్పుడూ అటువంటి పరిస్థితీ నాకు ఎదురవలేదు. అదే కాదు, భగవంతుడి దయవల్ల అనారోగ్యం కాని, జలుబు చేయడం, గొంతు బొంగురుపోవడం వంటివి కానీ నన్నెప్పుడూ బాధించనే లేదు. అన్నేసి గంటలపాటు ప్రవచనాలు చెప్పినా, గొంతు తడారిపోవటం, కంఠశోష వంటివి ఎప్పుడూ ఎరగను. ఇప్పటివరకూ నేను 250 దాకా రామాయణ ప్రవచనాలు, 300 మహాభారత ప్రవచనాలు, 200 భాగవత ప్రవచనాలూ చెప్పాను.
ఇవిగాక ప్రతియేటా ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవాడిని. దూరదర్శన్‌లోనూ, సప్తగిరి చానల్‌లోనూ ప్రవచనాలు చెబుతుంటాను. నాకిప్పుడు ఎనభై ఐదేళ్లు దాటాయి. ఒంట్లో ఓపిక సన్నగిల్లుతోంది, ప్రయాణాలు చేయలేకుండా ఉన్నాను. దాంతో 2011 జనవరి నుంచి నేను పురాణ ప్రవచనాలు చెప్పడం మానివేశాను.



అయితే ఇటీవల శ్రీవేంకటేశ్వర భక్తిచానల్, సప్తగిరి చానల్ వారు నా వద్దకొచ్చి ‘‘మీరు మా చానల్‌లో ప్రవచనం చెప్పవలసిందే’’ అని పట్టుబట్టడంతో మా ఇలవేల్పు పట్ల నాకున్న భక్తి, గౌరవం మేరకు వారిని కాదనలేకపోయాను. అందుకే అప్పుడప్పుడూ ఆ చానల్స్ వారికి మాత్రమే చెబుతున్నాను.
భగవంతుడు నాకిచ్చిన దానికి నేనెప్పుడూ అసంతృప్తి పొందలేదు. వైదిక ధర్మ ప్రచారం చేయడాన్ని, భగవంతుని లీలలను గానం చేయడాన్ని బాధ్యతగా భావించాను తప్పితే బరువనుకోలేదు. ఎవరికోసమూ ప్రత్యేకంగా చెప్పలేదు. సభలో భాగ్యవంతులున్నారా, పండితులున్నారా, పామరులున్నారా అని ఎన్నడూ ఆలోచించలేదు.
ఎవరినీ పనిగట్టుకుని పొగడలేదు. ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించాను. కాకపోతే పదేళ్లకొకసారి సామాజిక పరిస్థితులలో మార్పు వస్తుంటుంది కదా, అందుకు అనుగుణంగా మారుతూ వచ్చానంతే! అదెలాగంటే అప్పట్లోలా ఇప్పుడు పద్యాలు చెబుదామన్నా వాటిని విని ఆనందించేవారు లేరు కదా, అందుకు తగ్గట్టుగానే నన్ను నేను మలచుకున్నాను. అప్పుడే కాదు, ఇప్పటికీ నేను ఏ ఘట్టం చెబుతుంటే ఆ ఘట్టంలో పూర్తిగా లీనమవుతాను.



అది శోకరసమైతే నాకు దుఃఖమొస్తుంది. సంతోషకర సన్నివేశమైతే ఆనందంతో పరవశించి పోతాను. కాబట్టే ఇన్నేళ్లు గడిచినా, నా ప్రవచనం వినడానికొచ్చే ప్రేక్షక జనంలో తగ్గుదల లేదు. అయితే నేను మాత్రమే గొప్పగా చెప్పగలను అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇప్పటివాళ్లు కూడా బాగానే చెబుతున్నారు. ఆదరణ కూడా బాగానే ఉంటోంది. ఈ సంస్కృతి చిరకాలంపాటు వర్ధిల్లాలన్నదే నా ఆకాంక్ష!

సేకరణ:సాక్షి ఫన్ డేపురాణ’ పురుషుడు

Tuesday, April 24, 2012

అక్షయ తృతీయ


అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజు కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని డబ్బులేకున్నా అప్పు చేసో తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవ్వడం అటుంచి చేసిన అప్పులు తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అయ్యి కూర్చుంటాయి.


మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం..
ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పారు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమం, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. (పుణ్య కార్యాచరణం వల్ల వచ్చే ఫలితం అక్షయమైనప్పుడు పాపకార్యాచరణం వల్ల
వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుందిగా... ). ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మగారితో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాటి ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కర్మమాచరించినా కూడా తత్సంబంధఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి, తరవాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్ఛిష్ఠంగా, బ్రాహ్మణోఛ్ఛిష్ఠంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు. ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరవాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు. (అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము, అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారముని అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు)



శ్రీ నారద పురాణం కూడా, ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెప్తోంది. ఈ నాడు దానం ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో  ఈనాడు దానాది ఫలములు నారదమహర్షి ఇలా చెప్పారు. అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘ్రుత ధేను దానం చేసినవాని ఫలితం ఇంతింత కాదు,
సహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడై బంగారము, రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో  కల్పకోటి కల్పములు, కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున విరాజిల్లును. తరవాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు.  అంతమున బ్రహ్మజ్ఙానియై ముక్తిని పొందుతాడు. అలాగే యధావిధిగా గోదానము చేసినవాడు గోలోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్ల తరవాత భూమి మీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు. గంగా నది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని చేరెదరు. అక్కడే భూమిని దానం చేస్తే, ఎంత భూమిని దానం చేసాడో అంతభూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాదిపతి అగును. అతడు నిద్రించినచో భేరీ శంఖాది నినాదములచే మేల్కొలపబడును. సర్వ ధర్మ పరాయణుడై సర్వ సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న పితరులనందరినీ స్వర్గమున చేర్చి  స్వర్కమున నున్న పితరులనందరినీ మోక్షమున చేర్చి స్వయముగా జ్ఙానియై అవిద్యను జ్ఙాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యముని పొంది పరబ్రహ్మమును పొందెదడు. ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి.


ఈ తిథినాడు పదహారు మాస మితమగు (పదహారు మినప గుండ్ల ఎత్తు) స్వర్ణమును విప్రునకు దానమిచ్చిన, వాని ఫలము అక్షయము వాడు అన్ని లోకములందు పూజ్యుడై విరాజమానుడగును.


దీనివల్ల తెలిసేదేమంటే బంగారం కొంటే అక్షయం కాదు, ఈ రోజు చేసే ధర్మకార్యాలు, ఉపాసనలు, దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి అని.


తెలియని వారికి ఇది తెలియ చెప్పండి. ఈ నాడు డబ్బులు లేకున్నా అప్పు చేసి బంగారం యొక్క డిమాండు పెంచి తద్వారా ధర పెంచి, దేశ ఆర్థిక పరిస్థులను, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను ఇన్ఫ్లేషన్ పేర ఇబ్బంది పాలు చేయకండి.
--
మంచి విషయాన్ని తెలిసిన నాగేంద్ర  గార్కి ధన్యవాదములు 

Tuesday, March 27, 2012

అలెగ్జాండర్ మూడు కోరికలు



అలెగ్జాండర్ చాలా రాజ్యాలను జయించిన తర్వాత ఇంటికి తిరిగి వెళుతున్నాడు. మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురై మరణ శయ్యపై చేరాడు. తాను మరణించడం తథ్యమని అలెగ్జాండర్ కు అవగతమైపోయింది.తాను సాధించిన గొప్ప గొప్ప విజయాలు, అమిత శక్తిశాలురైన సైన్యం, అంతులేని సంపద తన్ను మరణం నుంచి దూరం చేయలేవని స్పష్టమైపోయింది.

... ఇంటికి వెళ్ళాలనే కోరిక తీవ్రతరమైంది. తన తల్లికి కడసారిగా తన ముఖాన్ని చ...ూపించి కన్ను మూయాలనే ఆశ. కానీ సమయం గడిసే కొద్దీ దిగజారుతున్న అతని ఆరోగ్యం అందుకు సహకరించడం లేదు. నిస్సహాయంగా ఆఖరి శ్వాస కోసం ఎదురు చూస్తున్నాడు. తన సైన్యాధికారులను దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు.

“నేనింక కొద్దిసేపట్లో ఈ లోకం నుంచి నిష్క్రమించబోతున్నాను. నాకు చివరగా మూడు కోరికలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నెరవేర్చకుండా విస్మరించకండి.” అని వారి నుండి వాగ్ధానం తీసుకున్నాడు.

అశ్రు నయనాలతో కడసారిగా తమ రాజు గారి ఆజ్ఞను వినమ్రంగా అంగీకరించారు ఆ అధికారులు.

నా మొదటి కోరిక: ” నా శవ పేటికను కేవలం నా వైద్యులు మాత్రమే మోయాలి”

రెండవ కోరిక: “నా పార్థివ దేహం స్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు, మణి మాణిక్యాలు పరచండి”

మూడవ కోరిక: “శవపేటిక లో నుంచి నా ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండి”


చుట్టూ మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు.కానీ వారిలో ఎవ్వరికీ ఆయన్ను అడిగే ధైర్యం లేకపోయింది. అలెగ్జాండర్ కు అత్యంత ప్రీతి పాత్రుడైన ఒక సైనికుడు దగ్గరగా వచ్చి, ఆయన చేతులను ముద్దాడి, ఆయన కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనక ఆంతర్యమేమిటో సెలవియ్యమని అడిగాడు.

అలెగ్జాండర్ అతి కష్టమ్మీద ఇలా అన్నాడు. “ఈ మూడు కోరికలు నేనిప్పుడే నేర్చుకున్న మూడు పాఠాలకు ప్రతిరూపాలు.”

“మొదటి కోరికలో నా ఆంతర్యం, నిజానికి ఏ వైద్యుడూ మరణాన్ని ఆపలేడు . ఒకవేళ వైద్యం చేసినా వల్లకాటి వరకే.” అని చెప్పడానికి.

“రెండవ కోరికలో నా ఆంతర్యం, నా జీవితంలో సింహ భాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది.అదేదీ నా వెంట తీసుకెళ్ళలేక పోతున్నాననీ, కేవలం సిరిసంపదల వెంటబడి విలువైన సమయాన్ని, జీవితంలో మాధుర్యం కోల్పోవద్దని చెప్పడానికి”

“మూడవ కోరికలో నా ఆంతర్యం ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటపుడు వట్టి చేతులతో వచ్చాను. ఇప్పుడు వట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికే ”

అని చెప్పి కన్ను మూశాడు.


అలెగ్జాండర్ రాజ్యకాంక్ష గల చక్రవర్తే కావచ్చు. కానీ ఆయన గురించిన ఈ సంఘటనలో భారతీయ ఆత్మ ఉంది.
-Srinivas Potluri

పురాణమంటే ?

పురాణాలలో సర్వశాస్త్రాలు ఇమిడి ఉన్నాయని పెద్దలంతా చెబుతూ ఉంటారు. అసలీ పురాణమంటే అర్థమేమిటి? పురాణాలు ఎన్ని ఉన్నాయి? వాటన్నిటినీ ఎవరితో పోల్చి చెబుతారు? అనే విషయాలను గురించి వివరించి చెబుతుంది ఈ కథా సందర్భం. పద్మపురాణం ఆది ఖండంలో దీనికి సంబంధించిన వివరణ ఉంది.


పురాణాలు మొత్తం పద్దెనిమిది. వీటికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఈ పురాణాలన్నీ శ్రీ మహావిష్ణువు స్వరూపంతో సరిపోతాయి. అందుకే శ్రీమహావిష్ణువును పురాణ పురుషుడని అంటూ ఉంటారు. ఆ నారాయణుడి
1) హృదయం పద్మపురాణం
2) చర్మం వామన పురాణం
3) తొడలు భాగవత పురాణం
4) మెదడు మత్స్యపురాణం
5) పృష్ణభాగం కూర్మపురాణం
6) కుడికాలు చీలమండ వరాహ పురాణం
7) బొడ్డు నారదపురాణం
8) వెంట్రుకలు స్కందపురాణం
9) ఎడమ భుజం శివపురాణం
10) కుడి భుజం విష్ణుపురాణం
11) ఎడమపాదం అగ్నిపురాణం
12) కుడిపాదం మార్కండేయ పురాణం
13) కుడిమోకాలు భవిష్యపురాణం అని పద్మపురాణంతోపాటు ఇతర పురాణాలు కూడా వివరించి చెబుతున్నాయి.

పురాణానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలున్నదే పురాణం అవుతుంది. ప్రధానంగా పురాణానికి అయిదు లక్షణాలను పేర్కొన్నారు. కాలక్రమంలో కొంతమంది పది లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు.

అయిదు లక్షణాలలో
1) సర్గం
2) ప్రతిసర్గం
3) వంశం
4) మన్వంతరం
5) వంశాను చరితం
పురాణానికి ఈ అయిదు లక్షణాలు ఉంటాయని పురాణాలతోపాటు, నిఘంటువులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ అయిదు లక్షణాలు మనకున్న పద్దెనిమిది పురాణాలలో ఒక్కోదానిలో ఒక్కొక్క లక్షణం ఎక్కువగా, మరో లక్షణం తక్కువగా వర్ణితమై కనిపిస్తుంది. ఎక్కువ తక్కువుల మాటఎలాఉన్నా అయిదు లక్షణాలు మాత్రం ఉండి తీరాల్సిందే.

వీటిలో
1) మొదటిదైన సర్గం అనే దానికి అర్థం సృష్టి అని, ఈ సృష్టి అంతా ఎలా జరిగింది? పంచతన్మాత్రలు, పంచభూతాలు ఎలా ఉద్భవించాయి? అని వివరించటమే సర్గం.
2) రెండో లక్షణం ప్రతిసర్గం. సర్గానికి వ్యతిరేకం ప్రతిసర్గం. అంటే సృష్టి ఎలా లయమవుతుంది? ప్రళయాలు ఎన్ని రకాలు? అవి ఎలా ఏర్పడుతాయి? అని వివరించటమే ప్రతిసర్గం
3) మూడో లక్షణమైన వంశంలో సృష్టి ప్రారంభం నుంచి ఎంతమంది రాజులు, వారి వంశాలు, ఆవిర్భవించాయి. వారి వంశాలు వర్ణనతో పాటు రుషుల వంశాలకు సంబంధించిన విషయ వివరణలు ఈ లక్షణంలో కనిపిస్తాయి.
4)నాలుగో లక్షణం మన్వంతరం. ఇది కాలగణనాన్ని చెబుతుంది. పద్నాలుగు మన్వంతరాల విషయాలు, వాటి అధిపతులు, వారికి సంబంధించిన విషయాలన్నీ దీనిలో వస్తాయి.
5)అయిదో లక్షణమే వంశాను చరితం. దీనిలో సృష్టి మొదలైన దగ్గర నుంచి పాలించిన రాజులు, చక్రవర్తుల, రుషుల వంశ చరిత్రలు వర్ణితమవుతాయి.

ఇలా ఈ అయిదు ప్రధాన లక్షణాలు తొలినాళ్ళ నుంచి అంతా పురాణాలకు ఉంటాయని, ఉండాలని చెబుతూ వస్తున్నారు. కాలక్రమంలో కొంతమంది ఈ అయిదు లక్షణాలను పది లక్షణాలుగా చేసి అలాంటి పది లక్షణాలు పురాణాలకు ఉండాలని చెప్పారు. సర్గ, విసర్గ, వృత్తి, రక్షణ, అంతరాలు, వంశం, వంశాను చరితం, సంస్థ, హేతువు, అపాశ్రయం అనే పది లక్షణాలను అనంతర కాలంలో వచ్చిన వారు పేర్కొన్నారు.

1) సర్గ అంటే ఇక్కడ కూడా సృష్టి అనే అర్థం.
2) విసర్గ అంటే జీవుల సృష్టి అని అర్థం చెబుతారు.
3) వృత్తి అనే పదానికి మనిషి తన జీవితాన్ని సాగించటానికి ఏ ఏ వస్తువులను వాడుతారో వాటిని గురించిన విషయాల వివరణ.
4) రక్షణ అంటే భగవంతుడు ధర్మ రక్షణకోసం అవతరించే తీరు అని అర్థం.
5) అంతరాలు అంటే మన్వంతరాల వివరణ.
6) వంశం అంటే రాజుల, రుషుల, వంశాల వివరణ.
7) వంశాను చరితం అంటే రాజుల, రుషుల వంశ క్రమంలో ఉన్న అన్ని తరాల చరిత్ర వివరణ.
8) సంస్థ అంటే ప్రళయానికి సంబంధించిన వివరణ.
9) హేతువు అని అంటే జీవుడి జనన మరణాలకు మధ్యన ఉన్న కర్మ సంబంధమైన విషయం. జీవుడు చేసే కర్మను బట్టే అతడి జీవితమైనా, సృష్టి అయినా అంతమవుతుందని చెప్పే విషయానికి సంబంధించిన వివరణ.
10) అపాశ్రయం అని అంటే పరబ్రహ్మం అని అర్థం. ఆ పరబ్రహ్మ శక్తినే అపాశ్రయ శక్తి అని అంటారు. దానికి సంబంధించిన వివరాలు దీంట్లో ఉంటాయి.

ఈ పది లక్షణాలు భాగవతం ద్వితీయ స్కందంలో మళ్ళీ కొద్దిపాటి తేడాతో కనిపిస్తున్నాయి. సర్గ, ప్రతిసర్గ, స్థానం, పోషణం, ఊతయం, మన్వంతరం, ఈశాను కథ, నిరోధం, ముక్తి, ఆశ్రయం... ఈ పది లక్షణాలు పేర్లలో తేడా ఉన్నా అర్థం మాత్రం ఒకటేనని పురాణజ్ఞలు వివరించి చెబుతున్నారు.

ఇలా పురాణానికి సంబంధించిన విషయాలు ఈ కథా సందర్భంలో కనిపిస్తున్నాయి.
-డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు
(ఈనాడు - సాహిత్యం నుండి)

Saturday, February 11, 2012

వివేక వాణి


 మీరు ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్కోవచ్చు .. http://www.divshare.com/download/16766221-d2a

Friday, February 3, 2012

అరుణాచలేశ్వర

తిరుపతి తిరుమల తీర్ధ స్నానములకు నైమిత్తిక తిధులు 


 

అరుణాచలేశ్వరుని దివ్య నామావళి



అరుణాచలేశ్వరుల దేవాలయము - ముఖ్యస్థానములు


గిరి ప్రదక్షిణములో చూడదగిన స్థానములు

స్నానము చేయుటకు ముందు పఠించవలసినవి

తీక్ష్ణ దంష్ట్ర!మహాకాయ!కల్పాంతదహనోపమ!
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి.

గంగే! చ యమునే!చైవ గోదావరి! సరస్వతి!
నర్మదే! సింధు! కావేరి !జలే2స్మిన్ సన్నిధిం కురు.

గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి,
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి.

యో2సౌ సర్వగతో విష్ణుః చిత్‍స్వరూపీ నిరంజనః,
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః .


పెద్దలు ఇక్కడ వివరించిన శ్లోకాలతో కలిపి, ఈ క్రిందవి కూడా పఠించుతె చాలా మంచిది: 
కావేరి తుంగభద్రాచ క్రిష్ణవేనిచ గౌతమి 
భాగీరతీచ విఖ్యాత పంచ గంగా ప్రకీర్తిత 
త్రిపుష్కర, త్రిపుష్కర, త్రిపుష్కర 
గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం
గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం.

Wednesday, February 1, 2012

శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి

ప్రమాణాలలో మొదటిది వేదం. దాని తరువాత ధర్మ శాస్త్రాలు, పిదప పురాణాల వల్ల తెలియదగిన ఋషుల నడవడి. ఆ తరువాత శిష్టాచారం, చివరి ప్రమాణం మనస్సాక్షి. ఈ క్రమాన్నే మనం అనుసరించాలి. కాని, ఈ కాలంలో అన్నీ తల క్రిందు అయ్యాయి. ఇప్పుడు మొతట మనస్సాక్షి; చిట్టచివరకు వేదం ప్రమాణం!
- శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి
----------------------
ఉగాది  
అందరికీ నమస్సులు
శ్రీ రాధాకృష్ణగారు చక్కని విషయాన్ని ప్రతిపాదించారు. ఈ విషయం చదివిన తరవాత నాకు ఠక్కున పరమాచార్య ఒకానొకప్పుడు ఈ వసంత నవరాత్రులలోనే బాలలతో కలిసి వారికి సందేశం ఇస్తూ వారికి మార్గదర్శకత్వం చేస్తున్నప్పుడు చెప్పిన మాటలు చదివినవి గుర్తుకొచ్చాయి. వాటి సారం క్రింద పొందు పరుస్తున్నాను.
బాలలూ ! ఉగాది, శ్రీరామనవమి, వసంత నవరాత్రులు అత్యంత ముఖ్యమైనవి. ఇలాంటి పండగల రోజులలో కేవలంగా విందు వినోదాలతో కాలక్షేపం చేయకుండా ఏదైనా ఒక మంచి వైదిక పని ప్రారంభించి నియమం పెట్టుకుని ఆ పని చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది.
ఉదాహరణకు శ్రీ రామ నవమి నాడు శ్రీ రామ నామం వ్రాయడం ప్రారంభించి రాముని చిత్రాన్ని ముందు ఉంచుకుని అతని గుణాలను తలచుకుంటూ రామనామాన్ని ఉచ్చరించండి. శ్రీ రామ అని వ్రాస్తూ ఉండడం వల్ల మనోబుద్ద్యహంకారాలు మంచి గుణాల మీద, భావాల మీద కేంద్రీకృతం అవుతాయి. ఈ ప్రకారం ఒక నియమం పెట్టుకుని ప్రతిరోజూ చేస్తే చక్కటి అనుశాసనం, క్రమ శిక్షణ అలవడుతుంది.
ఒక మంచి నియమాన్ని ఈ ఉగాది నాడు ఏర్పరచుకొని దాన్ని సంవత్సరం పొడుగూ నియమం తప్పకుండా చిన్నదో పెద్దదో చేస్తూ పోవటం వల్ల చిత్త శుద్ధికి సమయపాలనకు భగవత్ప్రాప్తికి మార్గం వేసుకోవడంలో దోహదం అవుతాయి.
కాబట్టి మనమూ ఎవరికి తోచింది వీలైంది వారు విధిగా ఏదో ఒక సత్కర్మను ఆరంభించి ముందుకు సాగుదాం. జగద్గురువులై, నడిచేదేవుడని పేర్గాంచిన పరమాచార్య ఎన్నో గొప్ప గొప్ప కార్య క్రమాలకు ఈ ఉగాది, వసంత నవరాత్రులరోజుల్లో శ్రీకారం చుట్టేవారు. గురువులను అనుసరించడమే శిష్యుల కర్తవ్యం. కాబట్టి మనమూ మంచి కార్యక్రమాలకి శ్రీ కారం చుడదాం.
శ్రీ రాధాకృష్ణ గారి ఈమెయిల్ ఐడి శ్రీ సాయి పథం, అంటే సద్గురువాణి వారితో చెప్పించింది. వారు చెప్పినదీ, పరమాచార్య చెప్పినదీ గుర్తుంచుకుని మనం ఈ నందన నామ సంవత్సరాన్ని ఆనంద నందనుని కృపకు పాత్రత పొందేలా మలచుకుందాం.
విధిగా ఈ నూతన సంవత్సరాది నాడు అందరం సాంప్రదాయ దుస్తులు ధరిద్దాం, వైదిక సాంప్రదాయాలను, తెలుగుతనాన్ని నింపుకుందాం. నింబకుసుమ
తత్ర చైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ: అని నిర్ణయసింధు.
అలాగే ఈ రూజు ముఖ్యంగా ఐదు కార్యక్రమాలు చేయాలని పెద్దలు చెప్తారు అవి
) తైలాభ్యంగనం = సూర్యోదయాత్పూర్వమే తైలాభ్యంగన స్నానమాచరించాలి, స్నానం ఎంత శుభ్రంగా చేస్తే అంత లక్ష్మీ ప్రదమని పెద్దలవాక్కు. ఐతే స్నానం సంకల్ప సహితంగా చేయాలి.
) నూతన సంవత్సరాది స్తోత్రం = నూతన సంవత్సరాదిని ఆ సంవత్సరాన్ని ప్రార్థించి ఇష్టదేవతాపూజ చేయటం. ఆ దేవతే కాల స్వరూపంలో ఈ నూతన సంవత్సరంగా వచ్చిందని తలచి సంవత్సరమంతా శుభం కలగాలని కోరుకోవాలి. కుటుంబ సమేతంగా పూజ చేయడం దేవాలయ సందర్శనం చేయడం ఉత్తమం.
)నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం) =  అష్ఠ దారిద్రాలను శోకములను పోగొట్టే ఓ వేప పుష్పమా నాకెల్లప్పుడూ శోకము లేని జీవితమును ప్రసాదించుము అని ప్రార్థిస్తూ, వేప పువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు, కొత్త కారం ,ఉప్పు, మామిడి పిందెల ముక్కలు తగుపాళ్ళలో వేసి (లేత మామిడి, అశోక చిగుళ్ళు కూడా వేసే ఆచారం ఉంది) కలిపి దేవునికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా అందరూ ఆరోజు తినాలని శాస్త్ర వాక్కు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం యు(ఉ)గాది నాడు సేవించే ఈ లేహ్యాన్ని "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అనీ పిలిచేవారు.
) ధ్వజారోహణం (పూర్ణకుంభదానం) = ఈ నాడు నూతన సంవత్సరాది కాబట్టి అందరి ఇళ్లపైనా నూతన ధ్వజారోహణం చేసేవారు (ఇప్పటికీ ఇళ్ళముందు, పైన భగవంతుని ముద్రాంకితమైన కాషాయ జెండాలు కట్టి ఎగురవేసేవారున్నారు). ఈ నాడు కొత్త కుండ కొని పూర్ణంగా నీరు నింపి దానం చేసే ఆచారమూ ఉంది.
)పంచాంగ శ్రవణం = ఈ నాడు సంవత్సరాదిని పురస్కరించుకుని రాబోవు కాలాన్ని జ్యోతిష్య శాస్త్రంతో కనిపెట్టి ఆయా గ్రహ గతులు, రాశి ఫలాలు, గ్రహణాలు, ఆదాయ వ్యయాలు కందాయ ఫలాలు రోజువారీ తిథి వార నక్షత్ర కరణ యొగాది విషయాలుండే పంచాగ శ్రవణం ఇత్యాదులు చేస్తారు. పంచాంగ శ్రవణం ద్వారా కాల స్వరూపుడైన భగవంతుని కృపకు పాత్రులు కాగలమనీ తద్వారా కాలంలో ఎదురయ్యే ప్రమాదాలతీవ్రతను భగవత్కృపతో తగ్గించుకోవచ్చనీ పెద్దలు చెప్తారు.
(ఐతే ఒక్కో పంచాంగంలో ఒక్కోలా ఉన్నదని విమర్శ ఉన్నది, అది కేవలం పంచాంగ కర్త వాడే పద ప్రయోగపు తేడా ప్రజ్ఙ లోపమే కానీ జ్యోతిష్య శాస్త్రలోపమెన్నటికీ కాదు.)
స్వస్తి: ప్రజాభ్య: పరిపాలయంతామ్ న్యాయ్యేన మార్గేన మహీమ్ మహీశా:
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమ్ లోకా సమస్తా సుఖినోభవంతు
  ------
సత్సంగము గ్రూప్ నుంచి వచ్చిన మెయిల్ ని నేను మీతో పంచుకోవడం జరిగింది . మీకు ఆసక్తి ఉంటే సత్సంగము గ్రూప్ లో జాయిన్ అవండి .